కలహము


శరీరకార్యములు స్పష్టమైయున్నవి;అవేవనగా,..కలహము. గలతి 5:19,20. ఆత్మీయులకు కలహము ఉండకూడదని లేఖనాలు స్పష్టంచేస్తున్నాయి. కలహము అను ఇట్టి శరీర కార్యములు కలవారు దేవుని రాజ్యమునకు అర్హులు కారని లేఖనాలలో వ్రాయబడింది. అబ్రహామును దేవుడు ఏర్పరచుకొనుటకు ఒక బలమైన కారణం ఏమనగా ఆయన ఎల్లప్పుడు శాంతి సమాధానాలు కోరుకునే వ్యక్తి. అబ్రహాము లోతు కలసి నివసించలేనంతగా వారికి ఆస్తిపాస్తులున్నాయి. లోతు అను అతని అన్నకుమారుని పశువుల కాపరులకు అబ్రహాము పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఈ వివాదం రాను రాను అధికం కాకూడదనే ఆలోచనతో అబ్రహాము లోతుతో మాట్లాడి మనము బంధువులము గనుక నాకును నీకును కలహాలు ఉండొద్దని వేరుగా ఉండుటకు లోతుకు ఆవకాశం ఇచ్చాడు. ఆది 13:8 కాబట్టి అబ్రాము మనము బందువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. లోతు ఒక చక్కటి ప్రాంతమును అనగా నీరు పారే ప్రాంతాన్ని ఆయన ఎన్నుకొన్నాడు. అక్కడ నివసించ సాగాడు. అబ్రహాము గుండెల్లో సమాధానము కొరకైన ఆశను చూడండి. ఆయన మంచి మేత భూమిని, నీరు పారే స్థలాన్ని శాంతి సమాధానాల కొరకు వదిలేసుకున్నాడు. అబ్రహాముకు కూడా మంచి మేతగల భూమి, నీరు పారే ప్రాంతం అవసరం ఎందుకంటే ఆయనకూ విస్తారమైన పశుసంపద ఉంది. వాటిని మేపుటకు ఆయనకు పచ్చిక ఎంతైనా అవసరమే కాని దానికంటే ఎక్కువగా ఆయన కోరుకున్నది సమాధానము. మనము బంధువులము గనుక సమాధానముగా ఉందాం తమ్ముడా అని కేవలం తన పెదవులతో మాత్రమే కాక క్రియల రూపంగా తన సమాధానమును తెలియపర్చాడు.


     అబ్రహాము లోతు వేరుగా నివాసముంటున్న దినాలలో లోతున్న ప్రాంతాన్ని శత్రువులు కొల్లగొట్టుకొని పోయారు. ఆ వార్త అబ్రహామునకు తెలియగానే ఆయన తన ఇంటనున్న దాసులను తీసుకొని లోతును అతని భార్యా పిల్లలను తనకు కలిగిన యావదాస్తిని తిరిగి సంపాదించాడు. లోతుకు గల దుస్థితిని బట్టి అబ్రహాము అతని నిందించక ఆపదలో ఉన్న సహోదరున్ని సహృదయముతో ఆదరించాడు. వేరుగా ఉన్న లోతు గురించి అబ్రహాముకు అసలు అవసరమే లేదు. అయినను ప్రాణమునకు తెగించి లోతుకొరకు పోరాడి తన హృదయములో నున్న సమాధానమును వ్యక్తపరచాడు. ఎప్పుడైతే అబ్రహాము లోతును అతని ఉపద్రవములో నుండి తప్పించి తన ప్రదేశమునకు తిరిగి వెళుతున్నాడో అప్పుడు తనకొక అద్భుతమైన దర్శనం కలిగింది అదేమనగా షాలేము రాజు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకొని అబ్రహామును ఎదుర్కొనుటకు బయలుదేరి వచ్చాడు. ఈ షాలేము రాజు ఎవరో కాదు సమాధాన కర్తయైన యేసయ్యే. సాక్షాత్తు దేవుడే బయలుదేరి అస్రమును ఎదుర్కొనుటకు వచ్చాడు. దేవాది దేవుడు అబ్రహాము అంతరంగాన్ని చూచి పులకరించిపోయాడు. ఇంతటి సమాధానము నా కుమారుని హృదయములో దాగుందా? నాకు కల్గిన మనస్సు అబ్రహాముకుందా, నేనిక ఆగలేను నా స్వభావం కలిగిన అబ్రహామును ఆశీర్వదించుటకు వెళ్ళవలసిందే అని బయలు దేరి అబ్రహామును ఎదుర్కొన్నాడు. అబ్రహామును ఆశీర్వదించి అతనికి రొట్టే ద్రాక్షారసమును ఇచ్చాడు. రొట్టె అనగా ఆహారము అది మన నిత్య అవసరతలను సూచిస్తుండగా ద్రాక్షారసము సంతోషమును సూచిస్తుంది. సమాధాన కర్త నీ హృదయంలోను, కుటుంబంలోను ఉంటే నీ నిత్య అవసరతలతో పాటు ఎల్లప్పుడు సంతోషం నీ సొంతం అవుతుంది. షాలేము రాజైన యేసయ్య నిత్యము నీతో ఉండాలంటే నీవు కలహము వీడి సమాధానము వెదకాలని వాక్యం బోధిస్తుంది.


     ప్రతి మనిషి సమాధానం కావాలని ఆరాటపడుతుంటాడు. సమాధానము కలిగి యుండాలంటే కలహాలు మానాలి. అసలు ఈ కలహాలు ఎలా పుట్టుకొస్తాయని మనం తెలుసుకుంటే వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడగలము.


1.సామెతలు 30:33:- కోపము రేపగా కలహము పుట్టును.


     యాకోబును బైబిల్ అంటుంది అతను సాధువు అని. కోపతాపాలు అసలే  యెరుగని యాకోబు ఒకరోజు తన భార్యమీద మండిపడతాడు. దానికి కారణం ఈమె అతనికి కోపం రేపుతూ వచ్చింది నేనడిగింది నాకు ఇవ్వు లేకపోతే చచ్చిపోతా, నీకు ఇచ్చే స్తోమత ఉన్నా లేకున్నా నాకనవసరం. ఇప్పుడిస్తావా లేకపోతే నేను ఇదే ఫ్యానుకి ఉరేసుకుంటా లేదా ఇదే బావిలో దూకి చస్తానంటు బెదిరించింది. కోపతాపాలు ఎరుగని యాకోబుకు కోపం రగులుకునేటట్లు చేసింది. రాహేలు యాకోబుతో-నాకు గర్భఫలమునిమ్ము; లేని యెడల నేను చచ్చెదననెను. ఆది 30:1 యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను.


     ఇద్దరు వ్యక్తుల మధ్యే గాని కుటుంబంలో గాని కలహాలు, వివాదాలు కలుగడానికి గల ఒక కారణం ఇతరులకు కోపం రేపటం. అది మాటలతో కానివ్వండి, చేతలతో కానివ్వండి ఎదుటివారికి కోపం వచ్చేలా ప్రవర్తిస్తే మనమే ఆ వివాదానికి కారణం అని గ్రహించాలి. వివాదం శరీర క్రియయని అది ఆత్మీయులకు అసలు తగదని మనం తెలుసుకొన్నాం. కాబట్టి ఇంటి వారికే గాని బయట వారికే గాని మన మాటలు చేతలు కోపం రేపే విధంగా ఉండకూడదు. ఉదాహరణకి భర్తకి భార్య అలా ఉండటం లేదా అలా మాట్లాడటం ఇష్టం ఉండదు. అయినా అలాగే ఆయన ముందు ప్రవర్తించే సరికి ఆయనకి పిచ్చి కోపం పుట్టుకొస్తుంది. ఇక ఇల్లంతా వివాదమయం. ఆయనకి కోపం రేపకుండా ఉంటే సరిపోతుంది కదా. అలాగే భార్యకు నచ్చని విషయమును భర్త ఆమే కళ్ళ యెదుటే పదే పదే చేస్తున్నాడనుకొండి ఇక ఆమె సహించలేక మాటలంటుంటే ఇక ఈయనేమో నేను నీ భర్తను నన్నే ఇన్ని మాటలంటావా? అని నానా మాటలతో ఇక మొదలవుతుంది వివాదం. కాబట్టి ఒకరికొకరు కోపం రేపుకొనక వివాదముకు చోటు ఇవ్వక ఉంటే ఎంత బాగుంటుంది..!


2. సామెతలు 26:20-22:- కలహము పుట్టించుటకు కలహ ప్రియుడు.


     ఎవరీ కలహ ప్రియుడంటే కొండెములు చెప్పువాడే కలహప్రియుడు. వీడు ఎక్కడుంటే అక్కడ కలహాలే. కట్టెలు లేకపోతే అగ్ని ఎలాగు ఆరిపోతుందో ఇద్దరి మధ్యలో కొండేలు చెప్పేవాడు లేకపోతే చిన్నపాటి మనస్పర్థలు ఏవైనా ఉన్నా అవి చల్లారిపోతాయి. , కొండెగాడు లేని యెడల అగ్ని ఆరిపోవును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహము పుట్టించుటకు కలహప్రియుడు. కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును. కొండేలు చెప్పేవాని మాటలు చాలా రుచిగా ఉంటాయట. ఆదిలో సర్పము చెప్పే మాటలు హవ్వకు చాలా రుచిగల పదార్థములుగా కనిపించాయి. అవి లోకడుపులోకి దిగిపోయాయి. కాని దేవుని మాటలు లోకడుపులోనికి దిగలేదు. చాలా మంది చాడీల మాటలను ఎంత ఆసక్తిగా ఆలకిస్తారో దేవుని వాక్యమును మరియు సత్యమును అంతగా పట్టించుకోరు. వాటిని హృదయంలో పదిలపర్చుకోరు వివాదమును రేపే మాటలకు చెవి పారేసుకుంటారు గానీ సమాధానమును చేకూర్చే సువార్తమానమును పెడచెవిన పెడుతుంటారు. వివాదము నీ దరి చేరవద్దనుకుంటే కొండెగానివై యుండకు అలాగే కొండెగాండ్లను దరి చేరనీయకు.


3. సామెతలు 29:22:- కోపిష్టుడు కలహము రేపును.


     కయీను కోపిష్టుడు. ఇతడు నీలాగా నాలాగా మాటకు మాట పెంచి తన కోపం వ్యక్తం చేయడు గాని అతనికి కోపమొస్తే చాలు ముఖము చిన్న బుచ్చుకొని ఎవ్వరితోను మాట్లాడకుండా తన కోపాన్ని అలక రూపంలో ప్రదర్శిస్తాడు. అలగడం సనగడం రెండూ సాతాను గుణాలే. రెండూ వివాదానికి దారి తీసే విషయాలే అయినా అలక అనేది సునామీ అంత తీవ్రమైనది దీని గూర్చి ఏమని వివరించమంటారు. ఇది అంతరంగమందు ఉండు తీవ్రమైన వివాదము. చివరకు అది కయీను చేత హత్యను జరిగించింది. ఊ అన్నా ఆ అన్నా పలకడే. భార్య అన్నం పెట్టి ఏవండీ భోంచేయండి అంటే తినడూ, మాట్లాడడు, వెరైటీ కోపం. ఈ కోపం సిగెరగదు. ఎవరైనా చూస్తే నన్ను పిచ్చోడనుకుంటారు. నా కోపాన్ని ఇప్పుడు ప్రదర్శించకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇంటికొచ్చిన బంధువులున్నారు అని కూడా యోచించకుండా మాటామంతి లేకుండా నా బుద్ది నా ఇష్టం అని ప్రవర్తించే వారిది తెలివేనా? కోపిష్టుడైన కయీను తమ్ముని చంపి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ తరువాత దేవునితో కయీను అంటాడు - నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినై యుందును. అందుకు కయీను-నా దోష శిక్ష నేను భరింప లేనంత గొప్పది. ఆది 4:13.


      సమాధన కర్తయైన దేవుడు వివాదములతో నిండిన కయీను హృదయములో నుండి వెళ్లిపోయాడు. దేవుని సన్నిధిని కయీను అనుభవించక పోవుటకు గల కారణం ఆయన హృదయములో ఉన్న వివాదమే. దేవుడు లేని జీవితం భరించలేనంత గొప్పది. దేవుడు నీ హృదయంలో, నీ కుటుంబంలో నివసించాలంటే కలహాలకు కారణాలుగా ఉన్నవాటిని నీవు విడిచి పెడితే అబ్రహామును ఎదుర్కొన్న షాలేము రాజు నిన్ను ఎదుర్కొనును గాకా..! ఆమేన్..!!


*******************************************************************************



ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.


మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు 


పరిచర్యను  గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:



ది హోలి మౌంటేన్  మినిస్ట్రీస్,


డో.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,


 గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,


ఆదిలాబాద్ , తెలంగాణ  504001.  


 సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.