భయ భక్తులు


భయ భక్తులు కలిగి మన జీవితమంతయు నెమ్మదిని, ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆయన కొన్ని మాటలను బైబిల్ గ్రంథమందు వ్రాయించారు. కొందరికి భయము వుంటే భక్తి వుండదు ఇంకొందరికి భక్తి వుంటే భయము వుండదు. భయము మరియు భక్తి ఈ రెండూ మన విశ్వాసజీవితానికి దీపముల వంటివి. భక్తివుంటే పాపమును పోగొట్టుకుంటారు(రక్షణ పొందుతారు). భయము వుంటే పాపము చేయజాలరు. భయభక్తులు కల్గి పాపముతో జోలి ఇక ఏమాత్రము లేకుండా జీవించగలరు.


యెహోవాయందు భయభక్తులు


షోమ్రోను పట్టణము ఇశ్రాయేలీయులు నివసించు పట్టణం. ఆ పట్టణం అష్నూరు రాజు చేత జయింపబడి అక్కడ నివాసం ఉన్న ఇశ్రాయేలీయులను అష్షూరూ  దేశమునకు చెరగొని పోయాడు. వారికి మారుగా ఇతర ప్రజలు షోమ్రోనులో కాపురముండనారంభించారు గానీ వారు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక సింహములు వారిని చంపసాగాయి. ఆ ప్రజలు కలత చెంది మేము కాపురమున్న దేశపు దేవుని మర్యాద మాకు తెలియదు గనుక సింహములు మమ్ములను చంపుచున్నవని అష్షూరూ రాజునకు మనవి చేయగా ఆ రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో అనగా ఇశ్రాయేలు యాజకులలో ఒకనిని అచ్చటకు తీసుకొని పోవుడి. ఆ యాజకుడు ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలు యాజకుడు యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను.


       కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. 2రాజు 17:28.


         దేవుని పట్టణము అనగా దేవుడు నివసించే మందిరమునకు నీవు వెళ్లునప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి నివసించాలని, లేకపోతే మరణం సంభవిస్తుందని నీవు గ్రహించాలి. అది దేవుని మందిరమో లేక వ్యాపారపు ఇల్లో తెలియకుండా సాగిపోతున్నాయి కొన్ని మందిరాలు. ఆర్థిక లావాదేవీలతో ఎల్లప్పుడు డబ్బు ఊసులతోను, లాభప్రాప్తినే అపేక్షిస్తూ దైవచింతన ఏమాత్రము లేక కేవలం డబ్బుపైనే నడుస్తున్న మందిరాలెన్నో చెప్పలేము.


         దేవుని మందిరమును వ్యాపార కేంద్రముగా మార్చినందున యేసయ్య దేవాలయంలోకి వెళ్ళి నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేసారని వారిని కోపగించుకున్న విషయం మనకు తెలిసిందే. ఎలాగైతే వ్యాపారులు ప్రజలను ఆకర్షిస్తారో చాలా మందిరాల్లో విశ్వాసులను ఆకర్షించుటకు దేవుని మర్యాదను ప్రక్కనబెట్టి వేరే వేరే మర్యాదలను అనుసరించి ప్రజలందరిని మరణానికి అప్పగిస్తున్నారు. ఒకని తండ్రి వారిని ఆకర్షిస్తేతప్ప ఎవడునూ నాయొద్దకు రాలేడు అన్న దేవుని మాటకన్నా వీరి ఆకర్షణలే ఎక్కువైపోయాయి. ప్రజలను దేవుడు ఆకర్షించాలి మనుష్యులు కాదు. ప్రియమైన విశ్వాసులారా.! మనము వేటిని చూసి ఆకర్షితులము కావాలి? దేవుని యొక్క క్రమమును, దైవభక్తిని, సత్తువగల బోధను చూసా లేక రంగులు, హంగులు, వేషభాషలనా? లోకములో ఆ వేషభాషకు మనకు ఏమైనా తక్కువా? విశ్వాసులారా! వివేచించండి. ఆడంబరపు జీవితమే కోరుకుంటున్నారు గాని ఆగమనపు ఆలోచన ఏమాత్రము చేయుటలేదు.


         యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు  తెలియకపోయెననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఆది 28:16 


          యాకోబు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. దేవుడు ఈ స్థలమందు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పుటకు కారణం దైవ దర్శనం, దేవుని స్వరం, దేవుని యందు భయభక్తులు అక్కడ కనబడ్డాయి కాబట్టే ఆయన భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం అని అన్నాడు. పాప భీతిని కలుగజేసేది దేవుని మందిరం. అది ఆట స్థలం కాదు, నాటక శాల కాదు. పరలోకపు గవినిగా ఉండవలసిన ఆలయాలు వ్యాపారపు గవునులుగా కొన్ని, ఆటమైధానపు గవునులుగా కొన్ని, ప్రదర్శన శాల గవునులుగా కొన్ని బహు పేరు ప్రఖ్యాతలను పొందుకున్నవి. దేవుని పద్ధతులలో దేవుని కార్యాలు జరగాలి గానీ ఇతర పద్ధతులలో మందిరాలు నడిపించబడుటకు వీలు లేనే లేదు. కాలయాపన చేసే వింత వింత ప్రధతులకు ఈ లోకము సరిపోదంటారా? దేవుని మందిరమే కావలసివచ్చిందా?


        మందిరము (Church) అనే బోర్డు ఉంటే చాలు ఇక్కడ దేవుడు ఉంటాడు అనుకొని వెంబడిస్తున్నారా? లేకపోతే నీ మనసుకు నచ్చినట్లు నీవు నడిచినా భయమేమి కలుగని స్థలమని వెంబడిస్తున్నారా? గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని ఎదురుచూస్తున్న సాతాను వలలో నీవు చిక్కుకొనకూడదంటే యెహోవాయందలి భయభక్తులు నేర్పే స్థలము నీకు కావాలి గానీ నీకు కాలయాపన కల్గించే స్థలం లేదా నిన్ను లోకపద్ధతులలో ముంచే స్థలం కాదు. ఏ స్థలములోనైతే దైవిక పద్ధతులలో ఆరాధన జరుగుతుందో అక్కడ దేవునియందు భయభక్తులను మనము నేర్చుకోగలము. ఆ దేశపు దేవుని మర్యాద నేర్పవలెనని ఆ రాజు యాజకులలో ఒకనిని యేర్పాటు చేసాడు. ఈ యాజకుడు బేతేలు ఊరిలో కాపురముండి యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించాడు.


కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. 2రాజు17:28.


      దేవుడు నివసించు స్థలములో మన ఇష్టానుసారంగా నివసించుటకు దేవుడు ఒప్పుకొనుటలేదు. దేవుని పద్ధతుల ప్రకారమే సమస్తము జరుగవలెనని ప్రభువుయొక్క ఆలోచన. దేవుని స్థలములో, దేవుని పద్ధతులలో నివసింపని వారిని చంపుటకు సింహములను దేవుడే అనుమతించాడు. దేవుడే ఒకరికి విరోధి కాగా ఎవరు వారిని రక్షించగలరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండతగిన మర్యాదను వారికి బోధించే యాజకుడు బేతేలులో కాపురమున్నాడు. బేతేలు అనగా “దేవుని మందిరము” దేవుని మందిరపు అనుభవములో జీవించే యాజకుడే మందిరపు పద్ధతులను బోధించగలడు. ఈత రానివాడు నీటిలో కొట్టుకొని పోతున్న వారిని ఎలా కాపాడగలడు? దేవుని యందు భయభక్తులు నేర్పుటకు ముందుగా బోధించేవారు ఆ అనుభవములో ఉండాలి. పరిశుద్ధ దేవుని మందిరపు పద్ధతులు ఈ లోకానుసారమైనవిగా ఉండక చాలా ప్రత్యేకముగా దేవుడు తన ధర్మశాస్త్రమందు తెల్పినట్లుగా వుంటాయి.


        దేవుని యందు భయభక్తులు కలిగియున్న అమ్మగారికి కళ్ళు నెత్తిన వుండవు. మందిరానికి వచ్చిన ప్రతివారిని పలకరించి, పరామర్శించి, వారి ప్రార్థన అవసరతలను తెలిసికొని వారమంతా వారికొరకు ప్రార్థిస్తుంది. భక్తిగల దైవజనుడు సూటూబూటు వేసుకున్న వారినే దృష్టించి వారిని మాత్రమే ఆదరించడు. దీన స్థితిలో ఉన్న విశ్వాసులను మీరు మరలా రండి అని పంపివేసిన దైవజనులు నాకు తెలుసు. వారి కొరకు వేరే ఆరాధన సమయమును కేటాయించుట నాకు తెలుసు. గొప్పవారిని పలకరించి పేదవారిని చూసిచూడనట్లు వెళ్ళిపోయిన దైవజనులు సహితము నాకు తెలుసు. వీరు దైవభయము లేని వారై అనేకులకు దేవుని పద్ధతులను బోధించుటకు బదులుగా భేదములనే కలుగజేస్తున్నారు. ఇలాంటి భయభక్తులు లేని స్థలములలోనా నీవు దేవున్ని ఆరాధించేది. ఒక్కసారి ఆలోచించు.


భయభక్తులు లేని ఆరాధన


  పరిశుద్దాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. కీర్తన 96:9


దేవుని సన్నిధిలో ఆరాధించే వారు ఎలాగుండాలో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఆరాధించే వారి అలంకారం పరిశుద్ధమైనదై వుండాలి. ఇది దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండతగిన పద్ధతి. - నేటి క్రైస్తవ్యములో జరుగుతున్న దారుణం ఒకసారి గమనించండి. వస్త్రధారణలో పరిశుద్ధత లేదు సరికదా వారి అలంకరణకి అంతే లేదు. రోజు రోజుకి ఒకరిని మించి ఒకరు ఈ లోక పోకడలకు పోయి ఆత్మీయతను పూర్తిగా మట్టికలుపుతున్నారు. Lipstick, eyebrow shaping లేనిదే ఆరాధనే లేదు టక్కుటిక్కు లేనిది పాటేరాదు. సినిమా హిరో, హిరోయిన్ ను తలపించే విధంగా మేకప్లు  షోఅవుట్లు, సినిమా పాటలను తలపించే విడియో షూటింగ్ పాటలు ఇవి దేవుని పద్ధతిలో జరుగుతున్న కార్యములేనా? స్టేజ్ మీద దేవుని వాక్యమే కరువైంది. వేర్వేరు సెటప్ లతో రకరకాల లైంటింగ్స్ తో మందిరాలను అలంకరిస్తున్నారు. పరిశుద్ధత ఏమాత్రము కనిపించుట లేదు. లోకానుసారమైన రీతిని మందిరములో ప్రవేశపెట్టి ప్రజలందరిని భయభక్తులు లేని వెర్రివారిగా మార్చి కుంపటి ఒడిలో పెట్టుకుంటున్నారు. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. ద్వితి 12:4


        లోకస్తులు చేసినట్లు మీరు దేవుని మందిరాలలో చేయకూడదని ప్రభువు ఖంఢితముగా ఆజ్ఞాపించాడు. అంతేకాదు నీవు ఎక్కడబడితే అక్కడ దేవుణ్ణి ఆరాధించవద్దని సెలవిచ్చాడు. నీవు చూచిన ప్రతీ స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ. ద్వితి 12:13


       ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వెంబడించే మనము భయభక్తులులేని స్థలమును ఆరాధించుటకు ఎన్నుకొనుచున్నామా? వాక్యాన్ని ప్రక్కనబెట్టి ప్రతి|స్థలమున అంటే మనసుకొచ్చిన స్థలములో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? మరొక వాక్యము చుద్దాము నేను మీకాజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేధ్యములను మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్ఠమైన మ్రొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. ద్వితి 12:11


      ప్రభువుని ఆరాధించే స్థలము మనకొకటి వుంది. అది ఎక్కడబడితే అక్కడ కాదుగానీ దేవుడు నివాసస్థలముగా ఏర్పరచుకొన్న స్థలములోనే మనం ఆరాధన చేయాలి. దేవుడు ఏ స్థలమును తనకు నివాస స్థలముగా యేర్పరచుకొంటాడు? భయభక్తులు కల్గిన స్థలమునే కదా.


సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. కీర్తన 96:9 భయము వున్నచోటే మనకు వణుకు పుడుతుంది. దేవున్ని నీవు ఆరాధించే స్థలములో పాపభీతిలేక అంతా తమాషాగా ఉన్నట్లైతే అది దేవుడు నివసించే స్థలం కాదని భయ భక్తులు గల స్థలం అసలే కాదని గుర్తించు. నీ ప్రాణాన్ని సింహము నోటనుండి రక్షించుకోదలిస్తే యెహోవాయందు భయభక్తులు కల్గి ఆయన యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను బోధించే స్థలమునే నీవు ఆరాధించే స్థలముగా ఎంచుకో. అట్టి వివేచన దేవుడు నీకు అనుగ్రహించి సింహపు నోటనుండి నిన్ను తప్పించును గాకా..!ఆమేన్..!


 


***************************************************


 ప్రభువు ది హోలిమౌంటేన్ పరిచర్యను ప్రేమించి ఇచ్చిన కడబూర ధ్వని అను ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక గత రెండు సంవత్సరాలుగా కొనసాగించుటకు ప్రభువు కృప చూపారు. ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా మీకు చేరువైన ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.


మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు 


పరిచర్యను  గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:ది హోలి మౌంటేన్  మినిస్ట్రీస్,


 ఇం.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,


 గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,


ఆదిలాబాద్ , తెలంగాణ  504001.  


 సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.