అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము ఏలాగనగా మనుష్యులు ధనాపేక్షులు. (2తిమోతి 3:1)
ధనం వుండడము తప్పేమి కాకపోయినా ధనం కొరకే బ్రతుకంతా నాశనం చేసుకుంటూ అదే సర్వస్వం అన్నట్లు దాని కొరకే దివారాత్రములు ప్రాకులాడటమే తప్పు. ఇలా రేయింబవళ్ళు అన్నీ వదిలేసి దాని కొరకే తపిస్తూ దేనిని లెక్క చేయకుండా అహర్నిశలు ప్రయాస పడటమే ధనాపేక్ష. ఈ లోకంలో ధనవంతుడిదేనండి పైచేయి. ధనవంతుడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది. ధనమున్న వారి కాళ్ల దగ్గరకు అన్ని పరుగెత్తుకుని వస్తాయి కాబట్టి నాకు కూడా అలాంటి సిరి కలగాలని కొందరు అభిప్రాయపడి ఏ దారిలోనైనా సరే డబ్బు సంపాదించాలని కంకణం కట్టుకుంటారు. వక్రమార్గాల్లో సంపాదించడం ఒకటికి రెండుసార్లు భయమేసినా మనస్సాక్షిని కూడా చంపేసుకొని అదే తప్పుడు సంపాదనలో ముందుకు కొనసాగుతూ వుంటారు. ఎవరో చెప్పారంటా పలానా అడవిలో గుప్తనిధులున్నాయని. ఇక ఈ వ్యక్తి అర్థరాత్రివేళ గుప్తనిధుల కొరకు ప్రయాణం కట్టాడు. జీవితమంతా త్రవ్వినా దమ్మిడి కూడా సంపాదించలేదు కదా అప్పులు కుప్పలై కూర్చున్నాయి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచి పెట్టుము. (సామె 23:4) ఇల్లు గడవడానికి శ్రమపడవలసింది పోయి ఉచితముగా వచ్చే ధనము కొరకు పరుగులు పెట్టి సమయమంతా పాడు చేసుకుని తర్వాత ఏడిస్తే ఏమి లాభం ?
ఒక చోట జరిగిన యధార్థ గాథ ఏమిటంటే ధనాపేక్ష కలిగిన ఒకాయన గుప్తనిధులను తన సొంతం చేసుకోవాలని ఆశించి దాని కొరకు ప్రాకులాడుతుండగాఆయనకు గల తప్పుడు ఆలోచన ప్రకారం నరబలి ఇస్తే తప్పక ఆ ధనం సొంతమౌతుందని అభం శుభం తెలియని ఒక బాలుని అమానుషంగా గొంతుకోసి చంపి పాతి పెట్టాడు. ఏ రీతినైతే నేమి ఒక్క రోజులో ఐశ్వర్యవంతుడను అయిపోవాలని అనుకున్నాడు గాని నేను తోటి మానవుని అమానుషంగా చంపేస్తున్నాను ఇది ఘోర పాపం అని, ఈ హత్యవలన ధనం కాదుగదా నా ప్రాణం పోయేంత పని జరుగుతుందని ఆలోచించలేక పోయాడు. దానికి కారణం ధనం మీద ఆయనకున్న పిచ్చి మాత్రమే. ధనాపేక్ష ఆయనను ఒక మృగంలా మార్చేసింది. ఒకవేళ ఆయనకు ఆ బాలుని హత్య చేయాలనే తలంపే లేకపోవచ్చు గాని ధనంమీద ఉన్న మోజు తనని అలా ప్రేరేపించింది. ధనాపేక్ష ఆయనను హంతకునిగా మార్చివేసింది. అందుకే బైబిల్ అంటుంది అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచి పెట్టమని. అన్ని అభిప్రాయాలు పాటించదగినవి కావు కొన్ని విడిచిపెట్టవలసి వుంటుంది. తప్పుడు త్రోవలోనైనా సరే నేను సంపాదించాలనే కోరిక నీకుంటే దానిని విడిచిపెట్టు. లేదా అది మొత్తానికే లేకుండా పోతుంది.
నీవు దానిమీద ఐశ్వర్యము మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును (సామె23:5) ఐశ్వర్యము మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవునని లేఖనాలు సెలవిస్తున్నాయి. దృష్టినిలపడం అంటే ఏమిటి? నిరంతరం డబ్బుమీదే ధ్యాస పెట్టడం. లేచినా కూర్చున్నా అవే తలంపులతో నిండియుండి దాని మీదే తీక్షణమైన ఆలోచనలు కలిగి యుండటం. డబ్బు ప్రతీ ఒక్కరికి అవసరమే గానీ దాని మీదే దృష్టి నిలుపవలసిన అవసరం లేదు. డబ్బు అనేది మన అక్కరలను తీర్చుకొనుటకు వాడే వస్తువే తప్ప అది మనకు సమస్తం కాదు. ఒకని ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా? కాదు గదా! ప్రాణం కంటే నాకు డబ్బే గొప్ప అని నీవనుకుంటే అది తప్పుడు అభిప్రాయం. నీవు అట్టి అభిప్రాయమును విడిచిపెట్టాలి.
ఏ చదువూ-సంధ్యా లేకపోయినా కూళో-నాలో చేసి డబ్బు సంపాదించగలవు కాని ఎంత కష్టపడినా ప్రాణానికి ఆధారమైన రక్తమును నీ కష్టము ద్వారా ఒక్కబొట్టు కూడా సంపాదించలేవు. ఇప్పుడు చెప్పు ఏది గొప్ప! డబ్బా? వెలకట్టలేని ప్రాణమా? డబ్బు మీదే దృష్టి నిలిపి మానవ విలువలన్నిటిని మంటగల్పుతున్నారు. బోడి డబ్బుకోసం దొంగతనాలు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం వారి చూపంతా డబ్బు మీద ఉండబట్టే. డబ్బే సర్వస్వమైతే అన్నముకు బదులుగా ఆ కాగితాలను నమిలి కడుపు నింపుకుంటే సరిపోతుంది. ఐశ్వర్యము సంపాదించాలనే ఆతురత తప్ప మంచి చెడు ఏది ఆలోచించలేరు ధనాపేక్ష గలవారు. దృష్టంతా డబ్బుమీదే. తరువాత ఏమి జరగబోతుంది? ఈ అక్రమ సంపాదన వలన ఏమేమి పర్యావసానాలు ఎదుర్కొంటాను? అనే ఆలోచన ఏ మాత్రం ఉండదు. కారణం దృష్టంతా డబ్బు డబ్బు డబ్బే. డబ్బు ఆలోచనలతో నిండిన ధనా పేక్షకునికి న్యాయం అన్యాయం మీద దృష్టి ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు ఈ అన్యాయం తారా స్థాయికి చేరుకుంటుంది. ఆ తరువాత రంగం బయటపడుతుంది. ఉన్న ఆధారం కాస్త కోల్పోయి ఇక ఆపసోపాలు పడుతుంటాడీ ధనాపేక్షకుడు. నిశ్చయముగా అది(ధనం) రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును (సామె 23:5). అది(ధనం) రెక్కలు ధరించి ఎగిరిపోవును అన్యాయంగా అప్పటి వరకు సంపాదించిందంతా రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. అది ఎలాగంటే ఇప్పుడీ ధనవంతునికి ఏ పని పాట, ఉద్యోగం సద్యోగం లేకుండా పూర్తి విరామం కలుగుతుంది. ఇతగాడేమో విలాసాలకు అలవాటైనవాడు. ఈయనకు ఖర్చులే తప్ప సంపాదన ఉండదు. కూర్చోని తింటే కొండలైన కరిగిపోతాయంటారు. ఇంటిల్లిపాది కూర్చోని తింటుంటే అప్పటి వరకు పోగేసిందంతా ఎగిరిపోకుండా ఉంటుందా మరి.
పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోతే క్రింద ఉన్నవారికి ఏమి కనిపించదు. కనిపించినా అతి చిన్నగా కనిపిస్తుంది. అంటే అక్రమ సంపాదనంతా ఏదోరకంగా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందన్న మాట. ఎంతగా ఎగిరిపోతుందంటే ఎవరికి కనిపించనంత చిన్నగా మారుతుంది. డాక్టర్ల వద్ద కొంత, దొంగలపాలై కొంత, కూర్చోని తింటే కొంత మొత్తం మీద చివరికి అంతా ఎగిరిపోతుంది. ఏమైందండి? నెలల తరబడి ఉద్యోగానికి వెళ్లడం లేదు? అని ఎవరినైనా అడిగితే ఆరోగ్యం బాగాలేదని బుకాయించి మరికొందరిని ఉన్నత చదువుకొరకు సెలవు పెట్టానని బుకాయించి అసలు విషయం చెప్పుకోలేక దాచలేక దురవస్థను కొనితెచ్చుకొనుటకంటే ధనాపేక్షను విడిచి పెట్టడమే క్షేమం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచిపేరు కోరదగినది( సామె 22:1). అక్రమ దారిలో డబ్బు సంపాదించుటకు తలపడి చివరకు మంచి పేరును కోల్పోయి పేరు ప్రతిష్టలను కోల్పోవుట వలన మనుష్యుల దృష్టిలో నీచులుగా మారిపోతారు. ఐశ్వర్యము ముఖ్యము కాదు గానీ మన బ్రతుకుకి మంచి పేరు ముఖ్యం. మంచి పేరుంటే కష్టకాలంలో ఎక్కడినుంచైనా సహాయం అందుతుంది. అందుకే గొప్ప ఐశ్వర్యము కంటే మంచిపేరు కోరదగినది. దేవా ఐశ్వర్యము నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్నువిసర్జించి-యెహోవా ఎవడని అందునేమో (సామె30:8). బైబిల్ లో ఒక భక్తుడు చేసిన ప్రార్థన ఇది. ఐశ్వర్యము ఎక్కువైతే నిన్నుకూడా లెక్కచేయనేమో దేవా కాబట్టి తగినంత నాకు ఇవ్వు చాలు అంటాడు. మనిషికి కావల్సిందేంటి? కూడు, గుడ్డ, తల దాచుకోవడానికి ఇంత ఇల్లు, ఇతర అవసరాలకొరకై కొంత ధనం అంతే కదా? కానీ ధనమును కూర్చుకొనుటకు సాధ్యమైనన్ని అడ్డదారులు వెతుకుతూ పతనావస్థకు చేరుకొంటారు.
ధనము శాశ్వతము కాదు. యోహాను దగ్గరకు కొందరు సుంకరులు మరియు సైనికులు బాప్తీస్మం పొందగోరి వచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అడిగారు. అందుకాయన మీరు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసికొన వద్దని, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనిందను వేయకయు, మీ జీవితములతో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పాడు. అదనపు డబ్బు కొరకు ఇతరులను పీక్కొని తినక వారికి కలిగిన ఆదాయముతోనే తృప్తి కలిగి ప్రతీ ఒక్కరు జీవించగలిగితే సమాజమెంత బాగుపడిపోతుంది! సమాజంలో ఎంత శాంతియుతమైన వాతావరణం నెలకొల్పబడుతుంది! ఎంత సంపాదించినా సమాధానమే కరువైతే ఆ సంపాదన వల్ల కలిగే లాభం ఏమిటి? డబ్బు లేకపోయినా మనిషి జీవించగలడు గానీ తన హృదయంలో నెమ్మది లేకుండా ఎక్కువ కాలం జీవించలేడు. ధనమును నమ్ముకొని ధగా పడక కలిగియున్న దానితో తృప్తిగా జీవించి నెమ్మదిగా బ్రతుకుటకు దేవుడు సహాయము చేయును గాక!
ఆమేన్..!
*******************************************************************************
ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.
మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు
పరిచర్యను గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:
ది హోలి మౌంటేన్ మినిస్ట్రీస్,
డో.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,
గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,
ఆదిలాబాద్ , తెలంగాణ 504001.
సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.