అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు.
అంత్యదినములలో మనుష్యులు స్వార్థప్రియులుగా ఉందురు. స్వార్థపరులు అనే కంటె స్వార్థప్రియులు అని వాక్యమెందుకు వక్కానించిందంటే, నా యిల్లు, నా పిల్లలు అనే సహజసిద్ధమైన భావన స్వార్థమే అయినా సమాజానికి హాని కలిగించదు గాని స్వార్థప్రియులు మాత్రం ఖచ్చితంగా అపాయాన్ని తలపెడతారు. ఎందుకంటే స్వార్థాన్నే ప్రీతిగా ఎంచుకొని దానికోసం ఇతరులను బలిగొంటారు. వారి ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ఎంతలా దుష్ప్రభావము కలుగ జేసినా, వారి మాటలు ఎంతలా చిచ్చులు పెట్టినా, గాయాలను రేపినా నా మనస్సులో వున్నది నేను నెరవేర్చుకున్నాను అనే తృప్తితప్ప మరొక ఆనందము వారికి వుండదు. వారు దేవుని ఆలోచన కంటే తమ సొంత ఆలోచనకు చోటు ఇస్తూ ఇతరుల మేలు కంటే తమ మేలును, బాగోగులను కోరుకొని ఆనందిస్తూ వుంటారు.
స్వార్థం వలన ఎంత నష్టం జరుగుతున్నను ఎవరికి ఎంతటి హాని కలుగుతున్నను పట్టించుకోని సమాజం బయలుదేరుతుందని అది అంత్యదినములకు ఒక సూచనగా దేవుడు లేఖనాల ద్వారా తెలియజేశాడు. స్వార్థప్రియులు కానవచ్చె ఈ కాలము అపాయకరమైన కాలమని బైబిల్ ఎందుకన్నదంటే స్వార్థంతో నిండిన వీరు న్యాయమును త్రిప్పివేసి అన్యాయము చేయుచు దీనులను, దరిద్రులను అణగదొక్కివేస్తూ కళ్ళముందే ఇతరులు లబోదిబో మంటున్నను “నేను”, “నాది” అనే ధోరణిలో వారు వెళ్ళిపోతుంటారు. స్వార్థపూరితమైన మాటల వలన ఇతరులు నొచ్చుకుంటారనే భావన లేక, ఎవరు బాధపడితే నాకేంటి నేను మాత్రం నా బుద్ధికి వచ్చినట్లు మాట్లాడుతూ, ఇతరులను కించపరచే విధంగానే వ్యవహరిస్తాను అనుకొని ఇటు మనస్సాక్షిని అటు దేవుని వాక్యాన్ని ప్రక్కనబెట్టి స్వార్థాన్ని తమ స్వభావముగా మార్చేసుకుంటారు. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయక మేలుల వెంబడి మేలులను తామే అనుభవించాలనే కోరిక వీరిది.
ఒకానొక అడవిలో ఓ పెద్దపులి నోట్లో ఎముక ఇరుక్కొని చాలా బాధతో గాండ్రిస్తూ, ఆర్తనాధలు చేస్తూ వుంటే అక్కడే చెట్టుమీద ఉన్న ఓ వడ్రంగిపిట్ట బాధతో ఉన్న ఆ పులి మీద జాలి తలచి ఏదైనా సహాయం చేద్దామని తనకు గల పొడవాటి ముక్కుతో పులి నోట్లో నుండి ఆ ఇరుక్కుపోయిన ఎముకను తొలగించింది. అప్పుడు ఆ పులి చాలా వందనాలు మిత్రమా అనుటకు బదులు ఇన్ని రోజులు ఏమి తినలేక ఆకలితో మండిపోతున్న నాకు దేవుడే నా నోట్లోకి ఆహారాన్ని పంపాడని స్వార్థపూరితమైన ఆలోచనతో ఆ పిట్టను నమలడం ఆరంభించింది. ఇక ఆపిట్ట బాధ అంతాఇంతా కాదు. చస్తూ చస్తూ ఆ పిట్ట అడివంతా ప్రతిధ్వనించేలా ఇలా అంది ప్రియమైన వారలారా.! అడవి అపాయంలో వుంది ఎందుకంటే స్వార్థం మన అడవిని తగులబెడుతుంది. ఎవరు ఎలా అయిన పోనీ ఎవరికి ఏమైనా కానీ నేను మాత్రం
మంచి - చెడు,
న్యాయం - అన్యాయం,
పాపం - పుణ్యం
ఏవి చూడను నాకు నచ్చిందే చేస్తాను నేను ఆలోచించేదే చేపడతాను. మేలు-కీడులతో నాకు పనేలేదు అనుకునే కాలమిదే, మనందరిని ముంచేసే కాలమిదే, స్వార్థప్రియులు కానవచ్చే అంత్యదినములు ఇవే అంటూ ప్రాణాలు కోల్పోయింది. స్వార్థపూరితమైన ఈ జనాలు ఎక్కడుంటారో అక్కడ హాని జరుగుతుంది.
మానవుడు సంఘజీవి. సహవాసం లేకుండా ఉండలేడు కదా! అలా సహవాసం కలిగి బ్రతుకుటకు ఒకరి సహాయం మరొకరికి కలుగుటకు ఇంకొకరి చేయుత మానవునికి ఎంతైనా అవసరం అని సంఘమును దేవుడు ఏర్పాటు చేసాడు. ఈ సహవాసములో ఒకరి భారములు మరొకరు భరిస్తూ సహోదర ప్రేమకలిగి ముందుకు నడువవలెనని లేఖనాలు తెలియజేస్తున్నప్పటికి ఆనాటి సంఘములలో వున్నట్లు నేడును స్వార్థప్రియులు సంఘాల్లో తారసపడుతున్నారు. అందుకే ఇట్టివారికి విముఖుడవై యుండుము. 2తిమోతి 3:5 అని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. స్వార్థప్రియులవలన నీకు ఎంతైనా అపాయమే గనుక అపాయకరమైన కాలము వచ్చిందని తెలిసికొనుటకు హెచ్చరికగా ఈ బూర కడవరి దినాలలో నీ కొరకు మ్రోగించబడుతున్నది. ఇవి స్వార్థప్రియులు కానవచ్చే అంత్యదినములు సుమా.!
అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఫిలిప్పు 2:21
సంఘములోని పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలని పలుమార్లు పౌలు తన పత్రికలలో కోరాడు. ఆది అపోస్తలుల కాలములో ఎవడును తనకు కలిగినవాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా వుండెను. వారు ప్రతివాని అక్కరకొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. విశ్వసించిన వారందరును ఏక హృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఏవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా వుండెను. వారు ప్రతివానికి వాని వాని అక్కరకొలది పంచి పెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదువ కాలేదు. అపో4:32,35 అపోస్తలుల కాలము మరలా రావాలి ప్రభువా, మేము ఆదినం చూడాలి దేవా అని ఎంతగానో ప్రార్థిస్తాము కాని మనకున్న దానిలో పేదవారిని జ్ఞాపకం చేసుకోవాలని, కొంత దిక్కులేని వారికి పంచిపెట్టాలని ఏ మాత్రము జ్ఞాపకమునకు రాదు.
ఎల్లప్పుడు స్వార్థముతో కూడిన తలంపే. నేను, నాది, నాకు, నా భోగభాగ్యాలు, నేను ఎలా గట్టెక్కాలనే తలంపులతోనే పూర్తిగా సతమతమవుతున్నావే గానీ! రేపటి దినాన నేను పరలోకము వెళ్ళినప్పుడు దేవుడు నన్ను చూసి “నేను ఆకలిగొంటిని గాని మీరు నాకు భోజనం పెట్టలేదు, పరదేశినైయుంటిని గానీ మీరు నన్ను చేర్చుకోలేదు” అని నన్ను అడుగుతాడనే భయమేమి లేకయున్నావు. ఇలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్దపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మత్తయి 25:41
చూడండి ఇతరులను ఆదుకొనకపోవుట ఎంత ప్రమాదమో వారు దేవుణ్ణి అడుగుతారు అయ్యా! మేమెప్పుడు నిన్ను ఆదుకొనలేదని అందుకు ప్రభువు మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని వారితో అంటాడు. ఇతరులను వారి అవసరతలలో ఆదుకొనకపోవుట వలన ఎంతటి శిక్షను అనుభవించాల్సి వుంటుందో చూసారా!
ఈ మందిరము పాడైయుండగా మీ సరంబివేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. హగ్గయి 1:4
దేవుని మందిరము పాడైయుండగా జనులు చక్కగా మేడ మిద్దెలలో ఏ మాత్రము చింత లేకుండా జీవిస్తున్న వారిని చూసి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించండి అంటున్నాడు.
దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటుననున్నదని చెప్పగా. 1దిన 17:1
దావీదైతే నా దేవుని మందసము గుడారములో వుండగా నేను ప్రాకారముగల పట్టణములో హాయిగా వుంటున్నాను అనే బాధ అతని హృదయములో మెదిలింది. నా దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి యున్నది కీర్తన 69:9.
దేవుని మందిరమును ఎప్పుడెప్పుడు కట్టాలనే ఆసక్తి అతనిని భక్షిస్తున్నదట. ఎంతటి ఔదార్యము గల హృదయము దావీదుది. మరి మీరు వెళ్ళే దేవుని మందిరాలు ఏ స్థితిలో ఉన్నవి? నీవు చేయవలసిన పనులేమైనా అక్కడ వున్నాయా? కూలిపోయిన గోడలతోను ఇంకా ఎంతో పని జరుగవలసిన పరిస్థితులలో ఆ మందిరముందా? మరైతే దావీదులా ఆయన మందిరమును గురించిన ఆసక్తితో నీవుండాలి.
ఓ దైవజనుడు తన విశ్వాసులను గూర్చి సాక్షమిస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. ఆకలితో ఉన్న దైవజనులు టిఫిన్ క్యారేజ్ తెస్తామన్న విశ్వాసులకొరకై ఎదురు చూస్తుండగా ఆ పిల్లవాడు రానే వచ్చాడంటా. ఏంట్రా! ఇంత ఆలస్యమైందని అంటూనే భోజనం చేయటానికి కూర్చుంటూ ఆనవాయితీగా ఏరా భోజనమైందా అని అడిగారట. ఆ పిల్లవాడు లేదన్నా మా ఇంట్లో కొన్నే బియ్యం వుంటే గబగబ అమ్మ అన్నం వండి మీకు పంపించింది. దైవ జనులు తింటే మనకు ఆశీర్వాదం అని అమ్మ చెప్పింది అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా! ఈమె ఎంతటి త్యాగ పూరితమైన స్త్రీయో కదా! తన పిల్లలు తిన్నాతినకపోయిన ఫరవలేదు కానీ దైవ జనుల కడుపు నింపాలనుకుంది. ఇలాంటి త్యాగపురితమైన విశ్వాసులు వుండబట్టే పరిచర్య అంతగా విస్తరించబడింది.
అవసరంలో వున్న బీదలు ఎదురుగా వున్నా చలించలేని విశ్వాసులను విశ్వాసులు అని పిలవడం దండగ. దేవుని మందిరము పాడైయుండగా దాని గూర్చి ఏమాత్రము చింతించని విశ్వాసులది విశ్వాసమే కాదు. దైవజనుల యోగక్షేమాలు ఆలోచించని విశ్వాసులు ఎంత కృతజ్ఞత లేని వారో చూడండి.
సొంత కార్యములతో నిత్యము మునిగిపోయి దివా రాత్రులు స్వార్థపూర్ణులై యున్నవారిని అసలు విశ్వాసులు అనవచ్చునా? ప్రియమైన దేవుని బిడ్డలారా! ఎక్కడ కూడా మనము స్వార్థమునకు చోటివ్వరాదు. ఆదిమ సంఘము సమస్తమును సమిష్టిగా వుంచుకొన్నారు. వారి జీవితంలో ఎక్కడా స్వార్థం కానరాలేదు. స్వార్థమనే అపాయంలో చిక్కుకొనకుండా జాగ్రత్త వహించు. అదే విధముగా నీ స్వార్థపూరితమైన ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎవరు కూడా అపాయములో పడకుండా జాగ్రత్త వహించు. దేవుడు నీకు సహాయము చేయును గాకా..! అమేన్..!!
స్వార్థప్రియులు
1. నాబాలు: నా అన్నపానములను నేను సంపాదించినవి వేరే వారికి ఇవ్వాలా 1సమూ25:11
2. బిలాము: ఇతరులకు నష్టము కలిగిన ఫరవాలేదు నా మనస్సులో ఉన్నది నెరవేరాలి. సంఖ్యా 22:12,38
3. యోనా: నేను చెప్పిందే జరగాలి. అది కీడైనను, నాశనమైన ఫరవాలేదు(నినెవే రక్షణ కంటే నాశనం కోరాడు). యోనా 3:5–4:2
4. ధనవంతుడు: నాకు ఇష్టమొచ్చినట్టు తింటాను, త్రాగుతాను నీవు ఎలాగుంటే నాకేంటి. లూకా 16:25
5. లేవీయుడు మరియు యాజకుడు: నీ చావు నువ్వు చావు. నీవు చచ్చినా బ్రతికినా నాకు అవసరము లేదు. లూకా 10:31,32
********************************************
ప్రభువు ది హోలిమౌంటేన్ పరిచర్యను ప్రేమించి ఇచ్చిన కడబూర ధ్వని అను ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక గత రెండు సంవత్సరాలుగా కొనసాగించుటకు ప్రభువు కృప చూపారు. ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా మీకు చేరువైన ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.
మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు
పరిచర్యను గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:
ది హోలి మౌంటేన్ మినిస్ట్రీస్,
ఇం.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,
గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,
ఆదిలాబాద్ , తెలంగాణ 504001.
సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.