యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. లూకా 2:52
దయాగుణమునకు యేసుప్రభువే మనకొక గొప్ప మాదిరి. శరీరదారిగా ఈ లోకములో సంచరించుచున్నప్పుడు సర్వ శరీరులకు ఒక మాదిరిని చూపించారాయన. మనము కూడా దేవుని దయను తప్పక పొందాలని ఆయన దయ ఉంటేనే మనము వర్ధిల్లుతామని అదేవిధముగా మనుష్యుల దయకూడా మనకు అవసరం అని ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. మనము అన్ని విషయములలో అన్ని కోణములలో వర్ధిల్లుటయే ఆయన వాంఛయై యున్నది.
దేవుని దయయందు వర్ధిల్లుట
i) దీనుని యెడల ఆయన దయ చూపును. సామె 3:34
నీవు దేవుని దయను పొందాలంటే నీ ప్రవర్తనయంతటిలో దీనత్వము కనపర్చాలి. నీవు ప్రభువును కన్నీటితో సమీపించినప్పుడు నీ హృదయము ఏలాగుందో అని ఆయన చూస్తాడు. కడివెడు కన్నీరు కారుస్తున్ననూ దీనత్వంలేని నీ హృదయ స్థితిని చూచి ఆయన ఏమియు చేయలేడు. అయ్యో! ఈ విశ్వాసి ఇంతగా ఉపవసించుట వ్యర్థమే. వీరు తమ ప్రయాసమును వ్యర్థపరచుకొనుచున్నారని దేవుడు కూడా దు:ఖపడుతుంటాడు. హిజ్కియా కన్నీళ్లు విడుస్తుంటే దేవునికి దయ కలిగినది ఎందుకంటే దేవుడు మాట్లాడిన వెనువెంటనే హిజ్కియా తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొన్నాడు. ముఖము ఒకని స్వభావమునకు గుర్తుగా ఉంది. ఆయన స్వభావమును త్రిప్పుకొని దీనునిగా మార్చబడ్డాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించుటకు ముందుగా తన హృదయ స్థితిని మార్చుకొన్నాడు. ఈ దీనుడు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తుండగా దీనుల యెడల దయచూపు దేవుడు హిజ్కియా యెడల దయ చూపించాడు. దేవుని దయను నీవు సంపాదించాలంటే దీనత్వం నీకు ఎంతైనా అవసరం
ii) దయగల వారి యెడల నీవు దయ చూపించుదువు కీర్తన 18:25
దేవుని దయను నీవు సంపాదించుటకు దీనత్వముతో పాటు దయ కలిగి నడుచుకోవాలి. దయగల వారిపై ఆయన దయ చూపించును. కఠినుల యెడల ఆయన వికటము చూపించును. కఠినుడైన అమాలేకియుడు ఒకడు తన దాసుడు కాయిలాపడగా వానిని అలాగే విడిచిపెట్టిపోయాడు. అప్పటి వరకు యుద్ధాలు చేస్తూ యజమానునికి సేవలందించిన ఈ దాసుడు కాయిలాపడగా చావు బ్రతుకుల మధ్యలో ఏమాత్రమును దయ తలచక వాని చావునకు వానిని వదిలివేసాడు. ఆ సమయములో దావీదు ఆ ప్రాంతములో కోల్పోయిన తనవారిని వెదుకుతు చెరపట్టబడ్డ ఇశ్రాయేలీయులను బట్టి తన భార్యబిడ్డలను బట్టి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా ఏడ్చి మిక్కిలి దు:ఖపడి యుద్ధానికి బయలుదేరగా విడిచిపెట్టబడ్డ ఈ దాసుడు దారిలో దావీదుకు కనబడగా వాడు మూడు రాత్రింబవళ్ళు అన్నపానములు ఏమియూ పుచ్చుకొన లేదని తెలిసికొని వాని మీద దయ తలచి వాని ప్రాణము తెప్పరిల్లజేసాడు.
పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు మూడు రాత్రింబవళ్ళు అన్నపానములేవియు పుచ్చుకొనలేదని తెలిసికొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షాగెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లెను. 1సమూ 30:11,12.
ఇలా దయ చూపించిన దావీదునకు దేవుడు దయ చూపించాడు. ఆ దేవుడే శత్రువులున్న చోటికి దావీదును నడిపించాడు. ఆ శత్రువులు తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తూలదూగుచూ వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్న పానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండగా దావీదు సంగతి గ్రహించి వారి మీదపడి తన భార్య బిడ్డలనేమి వారు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి, గొప్పదేమి యేదియు తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను. అంతా కోల్పోయి బహు కన్నీటితో ఉన్న దావీదు హృదయమును దేవుడు చూడగా అది దయగల హృదయముగా కనబడినందున దయగల వారియెడల దయ చూపించు దేవుడు దావీదునకు దయను చూపించెను.
మనుష్యుల దయ
నీ జీవితము నెమ్మదితో గడుచుటకు నీవు మనుష్యుల దయను కూడా సంపాదించవలసి వుంది. దేవుని దయుంటే చాలు మనుష్యుల గురించి నాకెందుకు అనుకోకూడదు. నీ ఉద్యోగములోను, వ్యాపారములోను, చదువుకొనుచున్న స్థలములోను, నీ యింటిలో సహితము మనుష్యుల దయ నీకు అవసరమై యున్నది. నిన్ను చూచిన వారందరికి నీపై దయ కలుగ వలెను. అప్పుడే ఇతరుల వలన నీవు దయ పొందెదవు. మనుష్యుల దయ నీకు కలుగవలెనంటే నీవు కొన్ని లక్షణాలు కలిగియుండాలి. అవేవనగా!
i) దయగల మాటలు: యేసు ప్రభువు భూమిమీద ఉన్నప్పుడు ఆయన నోటినుండి వచ్చిన దయ గల మాటలకు ఆశ్చర్యపడి ఆయనను గూర్చి సాక్షమిచ్చారు. అప్పుడందరును ఆయన గూర్చి సాక్షమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడిరి. లూకా 4:22. నీకు ఈ లోకంలో మంచి సాక్ష్యం కలగాలంటే నీ నోటనుండి దయగల మాటలు రావాలి. దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సామె 22:11.
యోనాతాను సామాన్యమైన దావీదును స్నేహించుటకు దావీదు నోటిలో ఉన్న దయగల మాటలే కారణం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినపుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. 1సమూ18:1. దావీదు మాటలాడుట చూసిన యోనాతాను అతని మాటలలోని దయను కనుగొని సామాన్యునితో స్నేహము చేసాడు. ఉద్యోగములో నీ అధికారి దయను సంపాదించుటకు నీ మాటల్లో దయ వుండాలి. ఆ దయగల మాటలే మనుష్యుల దయను సంపాదించును.
ii) దయా దృష్టి: దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. సామె 22:9 రూతు విధవరాలైన అత్తమీద దయాదృష్టి గలది. తాను సంపాదించిన ఆహారములో కొంత నయోమికి ఇచ్చింది. రూతు పరాయి దేశంలో ఆహారము సంపాదించుటకు ఆమెకున్న దయాదృష్టి కారణం. పనివారి యొద్దకు వెళ్ళి దయచేసి ధాన్యము యేరుకొనుటకు నాకు సెలవిమ్మని అడిగినప్పుడు ఎవరు కూడా ఆమెను కాదనలేక పోయారు. ఆ పొల యాజమానుడైన బోయజు కూడా ఆమెతో దయగా మాట్లాడి ఆమెయందు బహు విస్తారమైన దయను కనబరుస్తుంటే రూతు సంతోషించి ఏమి చూసి నాయందు ఇంత విస్తారమైన దయ కురిపిస్తున్నావని అడుగగా బోయాజు ప్రతిగా ఈ మాట అన్నాడు -నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయాజు-నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. రూతు 2:10,11 రూతు ఎలా దయాదృష్టి కలిగి తన ఆహారములో కొంత దిక్కులేని నయోమికి పంచి పెట్టిందో ఆ విషయము ఊరంతా సాక్ష్యముగా మారుమ్రోగింది. రూతు మనుష్యుల దయయందు వర్ధిల్లింది.
దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుటకు దేవుడు మనకు సహాయము చేయును గాకా.! ఆమేన్..!
***********************************************************
ప్రభువు ది హోలిమౌంటేన్ పరిచర్యను ప్రేమించి ఇచ్చిన కడబూర ధ్వని అను ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక గత రెండు సంవత్సరాలుగా కొనసాగించుటకు ప్రభువు కృప చూపారు. ఈ సంవత్సరం ఆన్లైన్ ద్వారా మీకు చేరువైన ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.
మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు
పరిచర్యను గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:
ది హోలి మౌంటేన్ మినిస్ట్రీస్,
ఇం.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,
గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,
ఆదిలాబాద్ , తెలంగాణ 504001.
సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.