బింకములాడు వారు


 


     అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు బింకములాడువారు. 2తిమోతి 3:1 బింకములాడువారు తమ స్థితిగతులను గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. వారికి ఉన్న హోదా, ఆస్థి అంతస్థులు, అంద చందాలు, పిల్లలు ఇలా ఏ విషయాలైనప్పటికి పోకడగా చెప్పుకుంటారు. సిగ్గుపడవలసిన విషయాలను కూడా గొప్పగా మలచి చెప్పేస్తారు. అబద్దాలను కూడా నిజం చేస్తూ వారికి లేని వాటిని ఉన్నట్లుగా బొంకుతుంటారు. తమకు తామే అన్ని విధాల సరిగానే ఉన్నాము మాకేంటి ఫరవాలేదులే అనుకొని ఆత్మ విమర్ష లేకుండా జీవితం కొనసాగిస్తుంటారు. దేవుని మందిరానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు ప్రార్థిస్తూ - దేవా నేను చోరులును, అన్యాయస్తులును, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలెనైననను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థించాడు. ఇప్పుడు సుంకరి ప్రార్థిస్తూ- దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించాడు. పరిసయ్యుని మాటలను మరియు సుంకరి మాటలను మనం పరిశీలిస్తే పరిసయ్యుని ప్రార్థనంతా గొప్పలతో నిండియున్నది. నేను ఇది చేసాను అది చేసాను నేను అన్నింటిలో కరెక్టుగానే యున్నాను అనే భావంతోనే ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెండు ప్రార్థనలు ఆలకించిన దేవుడు సుంకరిని పరిసయ్యుని కంటే నీతిమంతునిగా ఎంచి దేవుడన్న మాట ఏమిటంటే తన్ను తాను హెచ్చించుకొను వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. లూకా 18:14. పరిసయ్యుని ప్రార్థనంతా హెచ్చింపు మాటలతో నిండియున్నది. ఎక్కడా ఆత్మ విమర్శలేదు. నేను అన్ని విషయాలలో బాగానే ఉన్నాను నాలో ఏ పాపము లేదు దోషము లేదు అన్నట్లుంది ప్రార్ధన. ఈ విధమైన దోరణి వలన స్వతహాగా ఆయనకే కాదు సమాజానికి కూడా నష్టమే. ఎలాగంటారా ఆత్మ విమర్శ లేని వారికి వారు చేసేదంతా కరెక్టుగానే ఉంటుంది. ఇక ఇతరుల మాటలను అస్సలు వినిపించుకోరు. ఈ తరహా మనుష్యులు మాటి మాటికి వారిని వారు లేదా వారికి కలిగిన దానిని బట్టి పొగడ్తూ చెప్పుకోవడం వలన లోలోన అహంకారము ఏర్పడి ఇక నా అంతటి వారు లేరు, నేను ఆ పనిని చాలా బాగా చేయగలను, నాలాగా ఎవ్వరూ చేయలేరు అనే తాత్పర్యం గూడు కట్టుకొంటుంది. నాకు పోటిగా నిలిచే వారు ఎవ్వరు లేరు అంటూ విర్రవీగి మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడా ఓటమిని ఒప్పుకొనరు. ఓటమిని కూడా విజయముగా మలచి చెప్పుకుంటారు. సిగ్గు పడవలసిన విషయాలను సహితం సగర్వంగా చెప్పుకు తిరుగుతారు. ఎవరైనా ఎందుకిలా అని ఏవైనా ఎదురు ప్రశ్నలు వేసే అవమానమనే నురుగును కక్కుతూ, ప్రశ్నించిన వారిని తూలనాడుతుంటారు. నన్ను ఓడించగల్గిన వారు లేరు అంటూ తమ డప్పు తామే కొట్టుకుంటారు.


     బైబిల్ డంబముగా ప్రవర్తించుటను, అహంకారముగా మాటలాడుటను, బింకములాడుటను వ్యతిరేకిస్తుంది. బింకములాడు వారిని ఢాంబికుల జాబితాలోను, అహంకారుల జాబితాలోను చేర్చవచ్చు. బింకములాడు వారితో మనకేంటి అపాయం అని మనకు సందేహం రావచ్చు. ఈ బింకములాడు వారు వారి పంతాన్ని నెగ్గించుకొనుటకు ఎన్ని అబద్దాలనైనా సృష్టిస్తారు. ఎంతటి వక్ర మార్గమునైనా ఎంచుకుంటారు. ఎందుకంటే వారి మదిలో ఉన్న ఏకైక వ్యామోహం నేను నెగ్గాలి. ప్రగల్భాలతో అబద్దాలతో ఎందరెందరినో మాయగొల్పుతూ లబ్దిని పొందే బింకములాడువారు సమాజానికి ఎంతైనా కీడును సంక్రమింప జేస్తారు.


     ప్రియమైన దేవుని జనాంగమా బింకములాడుటకు అలవాటు పడితే అది రాను రాను అహంకారులను గాను గర్వాంధులును గాను చివరికి ఎంతకి వినని మూర్ఖులనుగా మార్చి వేస్తుంది. గొప్పలకోసం అప్పులు చేయటం, సరదాగా బ్రతకటం, ఇతరుల ముందు నేనెందుకు నామోషిగా బ్రతకాలనుకొని స్థితికి మించిన జీవితాన్ని గడుపుతూ భవిష్యత్తును నరకంగా మార్చుకునే ప్రియ సహోదరుడా, సహోదరి అట్టి తాత్పర్యం నీకుంటే దాన్ని వదిలివేయ లేనట్లైతే అది నిన్ను హరించి వేస్తుంది. దేవుని బిడ్డలు ఎంతో సాత్వీకంగాను, తగ్గించుకునే వారు గాను ఉండవలసింది పోయి ఫలనా మందిరంలో ఆ దైవజనుడు చెప్పే సాక్ష్యం కంటే ఈ వారంలో ఈ దైవజనుడు చెప్పే సాక్ష్యం దాన్ని బీట్ చేసే విధంగా ఉండేటట్లు చెప్పుకొస్తున్నారు. ఒకరికంటే మరొకరు గొప్పగా కనిపించాలనే తాపత్రయం వారిలో కొట్టొచ్చినట్లు కనబడుతూనే ఉంది. బింకములాడుతూ దేవుని రాజ్యాన్ని కట్టగలమా? నేను ఇంత త్యాగం చేసా లేదా నేను అంతలా శ్రమపడ్డా అంటూ చేసినదానికంటే ఎక్కువగా వర్ణిస్తూ బింకములాడితే దానికేమైనా ప్రతిఫలం ఉందనుకుంటున్నారా? అంత్యదినాలలో బింకములాడు మనుష్యులు ఉంటారని ఇలాంటి వారు ఉన్న కాలము అపాయకరమైన కాలమని మనకు వాక్యం సెలవిస్తుంది. ఎందుకని అది అపాయం అంటే లోకము యొక్క పోకడ రాను రాను శృతిమించి పోతూ ఉంది. ఈ పోకడలలో క్రైస్తవుడు మునిగి పోకుడదని వీరిని చూసి వారిని చూసి ముందున్న యేసయ్యను మరచి పోయే ప్రమాదం ఉందని యుగ సమాప్తియందున్న ఈ కాలం అన్ని యుగాల పోకడలను బహుగా రుచిచూచి కాలాంతమున కనీ వినని ఎరుగని రీతిలో అధికమైన పోకడలకు పోతుండగా క్రీస్తును వెంబడిస్తున్న నీవు వీటిలో ఇరుక్కొని పోయే ప్రమాదం ఎంతైనా ఉందని ముంగుర్తుగా నిన్ను జాగృతం చేయుటకే బింకములాడుట అనే గోతిలో నుండి నిన్ను లేవనెత్తుటకే ఈ కడబూర ధ్వని...


***********************************************************************************************


ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.


మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు 


పరిచర్యను  గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:



ది హోలి మౌంటేన్  మినిస్ట్రీస్,


డో. నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,


 గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,


ఆదిలాబాద్ , తెలంగాణ  504001.  


 సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.