నక్షత్రము యాకోబులో ఉదయించును


నక్షత్రము యాకోబులోనే ఉదయించుటకు గల కారణాలు చూసే ముందు ఎవరీ నక్షత్రము అని మనము ఆలోచిస్తే యేసుక్రీస్తులవారే ఆ నక్షత్రం. యాకోబు ఏశావులు ఇద్దరూ ఒకే తండ్రి కడుపున దాదాపు ఒకే సమయమున పుట్టిన కవలలు అయినా నక్షత్రము యాకోబులో మాత్రమే ఉదయించింది. వాస్తవానికి ఏశావు యాకోబులలో నక్షత్రం ఉదయించునని అనాలి. కానీ కేవలం యాకోబులోనే నక్షత్రం అను యేసుక్రీస్తు జన్మించుటకు గల కారణాలు చూద్దాం.


1.యాకోబు నివాసం: యాకోబూ నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాసస్థలములు రమ్యమైనవి సంఖ్యా 24:5.


                  గుడారము అన్నా నివాసం అన్నా ఒక్కటే. దేవుడు మానవుని హృదయమును ఆయనకు నివాస స్థలముగా కోరుకున్నాడు. యాకోబు హృదయంలో క్రీస్తు జన్మించుటకు గల కారణం అది రమ్యమైనదిగా ఉందట. ఏ విధముగా యాకోబు గుడారం రమ్యమైనదిగా కనబడుతుందని మనం వాక్యములో చూస్తే యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను (ఆది 25:27) యాకోబు సాదువు(plain hearted man)గా ఉన్నాడు. తన హృదయము నిష్కపటముగా యున్నది. హదయంలో అరమర  లేకుండా జీవించే వ్యక్తి. యాకోబు మోసగాడు కదా? ఈయనెక్కడి సాధువైన వ్యక్తి? అని అనుకోవచ్చు కానీ యాకోబు అంతరంగాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. యాకోబు అన్నయైన ఏశావును వాళ్ల తండ్రి అశీర్వదించాలని అనుకొన్నాడు. తల్లి అయితే యాకోబుకు ఆ దీవెనలన్నీ రావాలనుకొని తండ్రిని మోసగించడానికి యాకోబును సిద్ధము చేస్తూ ఉంది. అప్పుడు యాకోబు, అమ్మా నేను చేసే మోసం బయటపడిపోతుంది. నాన్న నన్ను తడివి చూస్తే శాపమే గానీ ఆశీర్వాదం తెచ్చుకొనను అన్నాడు.


              యాకోబు హృదయ స్థితిని మనం గమనిస్తే అది మంచి మనస్సాక్షిగలదై యున్నది. యాకోబు గుడారములలో నివసించేవాడు. యాకోబు తన హృదయమనే గుడారంను కాచుకొనేవాడు. గుడారమందు నివసించుట అనగా నిత్యము తన హృదయమును కాపలా కాస్తూ దానిలో వ్యమైనదేది ప్రవేశించకుండా అప్పటికప్పుడు సరిచేసుకొనే అనుభవంలో అతడున్నాడు. అతడు తండ్రి ఇంటనుండి ప్రయాణమై వెళ్లుచుండగా ప్రొద్దు గ్రుంకినందున అచట ఆ రాత్రి నిలిచిపోయాడు. అదే రాత్రి కలలో ఆయన దేవుని దూతలను మరియు సాక్షాత్తు యెహోవా దేవున్నే చూసాడు. హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవున్ని చూచెదరు (మత్తయి 5:8) ఎందుకని దేవుడు యాకోబునకు కనపర్చుకున్నాడు. ఆయన హృదయము శుద్ధిగా ఉండబట్టేకదా? ఆకాశము నుండి దేవుడు యాకోబు హృదయమును గమనిస్తే అది రమ్యముగా కనబడింది. అందుకే ఆయన యాకోబులో ఉదయించాడు.క్రీస్తు నీలో ఉదయించాలంటే నీ నివాసస్థలములు రమ్యముగా ఉండాలి.


2.ఏశావు నివాసం : ఏశావు అరణ్యవాసి (ఆది 25:27).


             ఏశావు నివాసం అరణ్యం. ఎప్పుడు వేటాడటం ఆయనకు అలవాటు. దానియందు ఆయన నేర్పరి. లోకమనే అరణ్యములో తిరుగుతూ ఎల్లప్పుడూ అవే ఆలోచనలతో నిండిన ఏశావు తన హృదయమును లోకపు నేర్పరితనమునకు అప్పగించుకొన్నాడు. ఏదో ఒక రోజు యాకోబును చంపాలని ఏశావు తన హృదయంలో పగపట్టాడు. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను (ఆది 28:41) - తన హృదయం కుళ్లు కుతంత్రాలతో నిండియున్నది. చివరికి నరహత్య ఘాతుకానికై ఆయన హృదయం సిద్ధముగా ఉన్నది. తనకున్న జ్యేష్ఠత్వపు హక్కు అనగా ఆత్మీయ జీవితం గురించి ఏమాత్రం పట్టించుకొనక దాని విషయమై చులకన భావం కల్గి ఒక్క పూట కూటి కొరకు ఎంతో విలువైన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకొన్న అవివేకి. తన హృదయాన్ని, తన మనస్సును అణచుకొననివాడు. తనలో ఉన్న ఆకలి కోరిక కొరకు ఆది సంభూతుడైన దేవున్నే ప్రక్కకు త్రోసివేసిన అజ్ఞాని. కన్న తండ్రి ఎంతో ప్రేమించగల కొడుకే అయినప్పటికీ ఆ తండ్రి చేత శాపమును కొనితెచ్చుకున్న అభాగ్యుడు. పరమతండ్రియైన దేవుడు కూడా ఏశావును ప్రేమించే కదా ఈ లోకములోనికి ఆయనను జ్యేష్ఠునిగా అనగా ప్రథమ సంతానముగా పంపించాడు. కానీ దేవుని యొక్క దీవెనలను త్రోసివేసి భ్రష్టుడైపోయాడు.


             ఒక్క పూట కూటి కొరకు ఈనాడు ఎందరు దేవున్ని తమ జీవితంలో నుండి త్రోసివేయట్లేదు? ఒక్క ఉద్యోగం నిమిత్తం, ఒక్క సెల్ ఫోన్ నిమిత్తం, ఒక్క పేరు-ప్రతిష్ట నిమిత్తం. ఒక్క పూట ఆకలికి ఓర్చుకోలేడా ఏశావు? చాలా చిన్న విషయము కొరకు అత్యున్నతమైనదాన్నే త్రోసివేశాడు. ఏశావు హృదయము పూర్తిగా లోకపు వేటలో నేర్పరితనం సంపాదించింది. హృదయాన్ని భ్రష్టత్వంతో నింపుకొన్నాడు. ఆయనకు దేవుని గురించిన ఒక్క ఆలోచన కూడా లేదు. ఏశావు యొద్దకు దేవుడొచ్చి ఏశావు నీ హృదయంలో కొద్దిగా స్థలమివ్వవా అని అడిగితే స్థలము లేదు అన్న మాట బదులుగా వినిపించింది. ఏశావులో స్థలం లేనందున యాకోబులో దేవుడు ఉదయించాడు. సర్వలోకము కొరకు క్రీస్తు ఈ భూమిపైకి దిగివచ్చిన వేకువ చుక్క. ఈ నక్షత్రం నీలో ఉదయించాలని పరితపిస్తూ నీతో హ్యాపి క్రిష్టమస్ జరుపుకోవాలని నీ హృదయమనే తలుపు తట్టుతుంది. మరి నీ సత్రంలో స్థలముందా? ఉంటేనే ప్రతి క్రిస్టమస్ ఒక హ్యాపీ క్రిస్టమస్ అవుతుంది...


*******************************************************************************ఈ మాస పత్రిక మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేసి ఆత్మీయ మేళ్లు పొందగలరు.


మాసపత్రిక పోస్ట్ ద్వారా పొందగోరుటకు మరియు 


పరిచర్యను  గురించి మరింతగా తెలుసుకొనుటకు, సహాకరించుటకు సంప్రదించండి:ది హోలి మౌంటేన్  మినిస్ట్రీస్,


డో.నెం. 2-146, చర్చ్ స్ట్రీట్,


 గాయత్రిగార్డెన్ ఎదురుగా, బెల్లూరి,


ఆదిలాబాద్ , తెలంగాణ  504001.  


 సెల్ నెం. 8978383500, 9491873500, 8500023295.